ఏపీలో మద్యం అమ్మకాలు షురూ అయ్యాయి. దాదాపు నలబై రోజుల తర్వాత షాపులు తీయడంతో.. మద్యం ప్రియులు పండగ చేసుకున్నారు. తొలిరోజు మందుబాబులు ఉత్సాహంగా ఉదయం నుంచే షాపుల దగ్గర క్యూ లైన్లు కట్టారు. సాయంత్రం 7 గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఎక్కువ జిల్లాల్లో తొలిరోజు స్టాక్ మొత్తం ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. తొలిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.సోమవారం ఒక్క రోజే మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.40 కోట్లుకుపైగా ఉండొచ్చని.. రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై అధికారులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,468 అధికారిక మద్యం షాపులకుగాను 2,345 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువగా 411 మద్యం షాపుల విక్రయాలు ప్రారంభించాయి. రెండో రోజు కూడా రద్దీ కొనసాగే అవకాశం ఉంది.. నాలుగైదు రోజులకు పరిస్థితి సద్దుమణుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో మద్యం అమ్మకాలు.. తొలిరోజే రికార్డ్ బ్రేక్!