పాలకుర్తి : పల్లెల ప్రగతికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కంకణం కట్టుకున్నారని, ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖకు భారీగా నిధుల కేటాయింపు జరిగిందని పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు త్వరలోనే నిధులు, విధులు, బాధ్యతల కేటాయింపులు జరగనున్నట్లు తెలిపారు. కాగా... ఈ నెలాఖరులోగా సీసీ రోడ్లను పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు. పాలకుర్తి, దేవరుప్పుల‌్లో సోమవారం ఆయన సిసి రోడ్లకు శంకుస్థాపన చేయడంతోపాటు పలు రోడ్లను ప్రారంభించారు. తన సొంత నియోజకవర్గ కేంద్రం పాలకుర్తిలో, దేవరుప్పుల‌్లోొ సోమవారం పలు సిసి రోడ్లకు శంకుస్థాపన, కొన్ని రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో పంచాయతీరాజ్, గ్రామీ నీటిసరఫరా, పల్లె ప్రగతి వంటి పలు అంశాలపై సమీక్షించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పంచాయతీరాజ్ శాఖకు రూ. 23,005 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారని దయాకర్ రావు వెల్లడించారు. సిసి రోడ్లకు రూ. 600 కోట్లు కేటాయించారని అన్నారు. పల్లె ప్రగతి కోసం ప్రత్యేకంగా నిధులు ఇచ్చారన్నారు. పల్లెల అభివృద్ధికి ఇంతగా పాటుపడ్డ ముఖ్యమంత్రి గతంలో లేరన్నారు. ప్రజల కష్టసుఖాలు, బాగోగులు తెలిసిన ముఖ్యమంత్రి కాబట్టే, పల్లెలకు సైతం అవసరమైన నిధులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే పల్లెప్రగతి కింద మంజూరైన, ఇతరత్రా గ్రౌండ్ అయిన సిసి రోడ్లన్నింటినీ ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని సిఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. సిఎం ఆదేశానుసారం మార్చి 31లోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. ఇక స్థానిక సంస్థల అధికారాలు, నిధులు, విధులు, బాధ్యతల విషయంలోనూ సీఎం కెసిఆర్ ద్రుఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. త్వరలోనే జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు సంబంధించిన అన్ని విషయాలను సిఎం పరిష్కరిస్తారన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లోపాల్గొన్నారు.
గ్రామాలకు త్వరలో మహర్దశ : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు