ఐపీఎల్ 2020లో ఆ ఆరు మ్యాచ్‌లు ప్రత్యేకం

సీజన్ మ్యాచ్‌లు మార్చి 29 నుంచి మొదలుకానున్నాయి. ఈ మేరకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయగా.. టోర్నీ చరిత్రలో తొలిసారి డబుల్ హెడర్ మ్యాచ్‌ల్ని కుదించారు. ఇప్పటి వరకూ శని, ఆదివారాల్లో రెండేసి మ్యాచ్‌లు జరుగుతుండగా.. ఐపీఎల్ 2020 సీజన్‌లో కేవలం ఆదివారం మాత్రమే రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.టోర్నీలో 8 జట్లు పోటీపడుతుండగా.. మార్చి 29 నుంచి మే 17 వరకూ లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే.. ఇందులో కేవలం ఆరు మ్యాచ్‌లు (ఏప్రిల్ 5, 12, 19, 26, మే 3, 10) మాత్రమే సాయంత్రం 4 గంటలకి.. అదీ ఆదివారం జరగనున్నాయి. మిగిలినవి అన్నీ కూడా రాత్రి 8 గంటలకి మునుపటి తరహాలోనే జరగనున్నాయి. అయితే.. నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం నాకౌట్ మ్యాచ్‌లు అరగంట ముందే అంటే.. రాత్రి 7.30 గంటలకే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.వాస్తవానికి ఆదివారం కూడా రెండు రోజుల మ్యాచ్‌‌ల నిర్వహణపై ఫ్రాంఛైజీలు, టోర్నీ బ్రాడ్‌కాస్టర్ తొలుత వ్యతిరేకించినట్లు వార్తలు వచ్చాయి. రోజుకి ఒక్క మ్యాచ్‌.. అదీ రాత్రి 7.30 గంటలకి నిర్వహించాలని డిమాండ్ చేశాయి. రాత్రి 8 గంటలకి ప్రారంభమయ్యే మ్యాచ్.. లేట్ నైట్ ముగుస్తుండటంతో వ్యూవర్‌షిప్ తగ్గుతోందని బ్రాడ్‌కాస్టర్ ఆవేదన వ్యక్తం చేయగా.. స్టేడియానికి వచ్చే అభిమానులు అర్ధరాత్రి ఇంటికి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని ఫ్రాంఛైజీ చెప్పుకొచ్చింది. అలానే సాయంత్రం 4 గంటల మ్యాచ్‌కి పెద్దగా వ్యూవర్‌షిప్‌ ఉండట్లేదని ఫ్రాంఛైజీలు, బ్రాడ్‌కాస్టర్ ఇటీవల చెప్పుకొచ్చాయి.